VP Dhankhar: బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతికి గడువు.. స్పందించిన జగదీప్ ధన్ఖడ్
రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతికి కాలపరిమితిని (Deadline On Bills) నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్.. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు రాష్ట్రపతికి ఆదేశాలు జారీ చేసే పరిస్థితి రాకూడదని ఆయన అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా, రాష్ట్ర శాసనసభలు రెండుసార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించకుండా జాప్యం చేయడం, అలాగే రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లులు కూడా తీవ్ర జాప్యానికి గురికావడంపై సుప్రీంకోర్టు ఇటీవల చారిత్రాత్మక తీర్పును (Deadline On Bills) వెలువరించింది. ఈ తీర్పులో గవర్నర్లతో పాటు రాష్ట్రపతి వద్దకు వెళ్లే బిల్లులను మూడు నెలల గడువు విధించింది. ఈ సమయంలోగా ఆ బిల్లులను ఆమోదించడమో లేదా తిరిగి పంపించడమో చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచించిన మూడు నెలల కాలపరిమితిని (Deadline On Bills).. గవర్నర్లు రాష్ట్రపతి పరిశీలనకు పంపిన రాష్ట్ర బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి గడువుగా విధించడం సమంజసమని ధర్మాసనం పేర్కొంది.













