ఈ జీవో వల్ల 3 లక్షల మంది విద్యార్థులకు నష్టం : లోకేష్
విద్యార్థులకు నష్టం కలిగించే జీవో నంబర్ 77ను ఉపసంహరించుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 77 రద్దుపై సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడిలో అరెస్టయిన టీఎన్ఎస్ఎఫ్ నేతలు గుంటూరు జిల్లా జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. వీరికి జైలు వద్ద లోకేశ్ స్వాగతం పలికారు. ఈ జీవో వల్ల 3 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. విద్యార్థుల తరపున పోరాటం చేస్తే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. బోధనా రుసుం, ఉపకార వేతనాల్లో కోత వేసే జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామన్న వైకాపా హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కేసుల మాఫీ కోసం కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. పైగా ఉన్న పరిశ్రమలే వెళ్లిపోతున్న దయనీయ పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న యువత ఈ విషయంపై ఆలోచించాలన్నారు. వచ్చే నెలలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా పోరాడతామని, ఎక్కువ పంచాయతీల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.













