ఎస్ఆర్ఎంలో కాలిఫోర్నియా యూనివర్సిటీ బృందం
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు, డైరెక్టర్లతో కూడిన ప్రత్యేక బృందం అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. యూనివర్శిటీలోని బోర్డు రూమ్‌లో రెండు గంటల పాటు ఎస్ఆర్ఎం యాజమాన్యం, ప్రొఫెసర్లతో బృంద సభ్యులు వేర్వేరుగా సమావేశమయ్యారు. సాధ్యమైనంత త్వరలో అమరావతి ఎస్ఆర్ఎంలో కాలిఫోర్నియా యూనివర్శిటీ భాగస్వామ్యంతో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2019 మేలోగా వీటి ఏర్పాటు జరగాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే పరిశ్రమల స్థాపనకు దోహదపడే డిజైన్ సెంటర్‌ను కూడా ఎస్ఆర్ఎంలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కాలిఫోర్నియా యూనివర్శిటీ బృందంలో పలువురు చీఫ్ సైంటిస్ట్‌లు ఎస్ఆర్ఎంలో చేపట్టాల్సిన నూతన ప్రాజెక్టులపై పలు సూచనలు చేశారు. ఎస్ఆర్ఎం అమరావతిపై వీసీ డాక్టర్ జంషెడ్ భరూచా కాలిఫోర్నియా యూనివర్శిటీ బృందానికి సమగ్రంగా వివరించారు.













