టీడీపీలోకి బైరెడ్డి రాజజశేఖర్ రెడ్డి!
కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి రాజశేఖర్రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన త్వరలో సొంతగూటికి చేరుకోనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాయలసీమ హక్కుల కోసం పోరాడారు. ఈ క్రమంలో ఓ పార్టీ కూడా నెలకొల్పారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఆయన టీడీపీ అధిష్ఠానంతో మంతనాలు జరుపుతున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఈ క్రమంలో ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని బైరెడ్డి టీడీపీ అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. తాను ఆ స్థానం నుంచి బరిలోకి దిగితే అటు అసెంబ్లీ స్థానంలో గెలవడంతో పాటు, ఇటు టీడీపీ లోక్సభ అభ్యర్థి గెలుపునకు కూడా లాభిస్తుందని చెప్పినట్లు సమాచారం. దీనిపై అధిష్టానం నిర్ణయం వెలువడాల్సి ఉంది. చర్చలు సఫలమైతే టీడీపీలో బైరెడ్డి చేరే అవకాశం ఉంది.













