ఈ ప్రాజెక్టు వల్ల తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం: బైరెడ్డి
కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన అప్పర్‌భద్ర ప్రాజెక్టు నిర్మాణంతో రాయలసీమ ఎడారిగా మారుతుందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అప్పర్‌భద్ర నిర్మాణానికి వ్యతిరేకంగా కర్నూలు జిల్లాలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. రాజోలి ఆనకట్ట నుంచి ఆదోని వరకు 3 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా బైరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వల్ల తెలుగు రాష్ట్రాల నీటి వాటాకు తీవ్ర అన్యాయం వాటిల్లుంతోందని ఆరోపించారు. అప్పర్‌భద్ర నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రికెట్ మ్యాచ్‌లా చూస్తున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు విషయమై తెలుగు రాష్ట్రాల సీఎంలు అత్యవసర భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపాలని కోరారు. రాయలసీమ ఎంపీలు, ఎమ్మెల్యేలు అప్పర్‌భద్రను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకుంటే ప్రత్యేక రాయలసీమ డిమాండ్ లేవనెత్తుతామని హెచ్చరించారు. దీనిపై రాయలసీమ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి సంతకాలు సేకరించి కేంద్రానికి పంపిస్తామన్నారు.













