రాయలసీమపై జగన్కు చిత్తశుద్ధి లేదు: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
రాయలసీమకు ఏదో చేస్తున్నట్లు జగన్ మోసం చేస్తున్నాడే కానీ, అవన్నీ చిల్లర ప్రాజెక్టులే అని రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో చేపట్టిన ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా తెచ్చారా? అని నిలదీశారు. రాయలసీమ విషయంలో జగన్ మైండ్ ఏమాత్రం పనిచేయడం లేదని మండిపడ్డారు. ఈ గడ్డపై జగన్కు చిత్తశుద్ధి లేదని, సీమను అంటరానిదిగా ఇక్కడి నాయకులు మార్చారని నిప్పులు చెరిగారు.
ఈ క్రమంలోనే రాయలసీమ కర్తవ్య దీక్షను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాయలసీమ యువత ఉన్నత చదువులు చదివినా కూడా ఇతర రాష్ట్రాల్లో కూలి పని చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పర్ భద్ర, తీగల వంతెన.. రాయలసీమకు ఉరితాడులన్నారు. గుండ్రేవుల ప్రాజెక్ట్ రాయలసీమకు ఎంతో ముఖ్యమైందని, దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదని మండిపడ్డారు. 70 నుంచి 80 టీఎంసీల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్ సీమకు కావాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఈ నెల 14వ తేదీ నుంచి 21 వరకు సంతకాల సేకరణ కార్యక్రమం చేపడతామని తెలిపారు. సంతకాల సేకరణ తర్వాత ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఉద్యమంలో రెండో దశగా ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని బైరెడ్డి ప్రకటించారు.













