టీడీపీకి త్వరలో యువనాయకత్వం.. బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి అందులోనే కొనసాగుతున్న నేత. పలుసార్లు మంత్రి పదవులు కూడా అనుభవించారు. ఏదైనా విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం బుచ్చయ్య చౌదరి ప్రత్యేకత. విపక్ష నేతలను విమర్శించాలన్నా.. స్వపక్షంలో తప్పులను ఎత్తి చూపాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా.! తాజాగా బుచ్చయ్య చౌదరి ఇలాంటి కామెంట్సే చేశారు. ఇప్పుడివి పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి.
తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 ఏళ్లయింది. ఆ పార్టీ 40వ వార్షికోత్సవం సందర్భంగా రాజమండ్రిలో జరిగిన వేడుకల్లో బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. పార్టీలో పెనుమార్పులు సంభవించబోతున్నాయని బుచ్చయ్య చౌదరి చెప్పారు. యువనాయకత్వం రాబోతోందని.. పార్టీకి ఇక తిరుగుండదని ఆయన వ్యాఖ్యానించారు. 40 ఏళ్ల ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని.. ఇలాంటి ఆటుపోట్లు పార్టీకి కొత్త కాదని బుచ్చయ్య చౌదరి అన్నారు. సమస్యలు వచ్చిన ప్రతిసారి పార్టీ వాటిని అధిగమించి ముందుకు సాగిందన్నారు.
ఈ మధ్య కాలంలో పార్టీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో వరుస ఓటములు పార్టీ శ్రేణులను కుంగదీస్తున్నాయి. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రావాలంటూ నినాదాలు ఊపందుకుంటున్నాయి. ఇదే విషయంపై బుచ్చయ్య చౌదరి స్పందించారు. లోకేశ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు యువనేతలు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించబోతున్నట్టు చెప్పారు. క్షేత్రస్థాయి పరిశీలనతో కూడిన కొత్త నాయకత్వం త్వరలో రాబోతోందన్నారు బుచ్చయ్య చౌదరి. పార్టీలోకి ఎవరు రావాలి.. ఎవరు పోవాలి.. అని కాకుండా వచ్చిన వాళ్లు పార్టీని ఎలా బలోపేతం చేయాలనేదానిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
వాస్తవానికి ఈ మధ్య పార్టీ అధినేత చంద్రబాబు కూడా యువనాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్టు వార్తలొచ్చాయి. సీనియర్లను పక్కనపెట్టి యువతరాన్ని ప్రోత్సహించాలని పార్టీ అధినేత చాలాకాలంగా భావిస్తున్నారు. అయితే కొన్ని మొహమాటాలు, సీనియర్ల పంతాల వల్ల అది ఆచరణ సాధ్యం కావట్లేదు. అయితే ఈసారి మాత్రం అలా మొహమాటాలకు పోకుండా ఆచరణలో పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూద్దాం.













