తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో తక్కువే
తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ద్రవ్యలోటు తక్కువేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఏపీలో ద్రవ్యలోటు ఎక్కువగా ఉందని వస్తున్న ఆరోపణలపై మంత్రి స్పందించారు. ఢిల్లీ లో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మాత్రమే అప్పులు చేస్తున్నట్లు చిత్రీకరిస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ ద్రవ్యలోటు 4.13 ఉంటే, ఆంధ్రప్రదేశ్‌ది 3 శాతం మాత్రమే ఉందని వివరించారు. ఎక్కువ శాతం వడ్డీకి రుణాలు తీసుకుంటున్నామని చేస్తున్న ఆరోపణలను ఖండించారు. 2014`15లో ఏపీ ద్రవ్యలోటు రూ.20,745 వేల కోట్లుగా ఉంటే, 2021`22 నాటికి రూ.25,195 కోట్లకు చేరిందన్నారు. ఎవరిని భయపెట్టాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ద్రవ్యలోటు విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పరిస్థితి మెరుగ్గానే ఉందని స్పష్టం చేశారు. యావద్దేశ అప్పు శాతం పెరిగింది. కొవిడ్`19 పరిస్థితుల కారణంగా ఇలా జరిగింది అని స్పష్టం చేశారు.













