దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ రకమైన పరిస్థితి : బుగ్గన
బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువగా అప్పులు చేసిన మాట వాస్తవమేనని ఆంధప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొవిడ్ పరిస్థితుల దృష్యా రాబడి విపరీతంగా తగ్గిపోయిందని, ఖర్చు కూడా విపరీతంగా పెరిగిందన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ రకమైన పరిస్థితి నెలకొందని చెప్పారు. గతేడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో దాదాపూ ప్రతిరోజూ కరోనా నియంత్రణ చర్యల కోసమే ప్రభుత్వం రూ.వందల కోట్లు వెచ్చించాల్సి వచ్చిందన్నారు.
తమది సంక్షేమ ప్రభుత్వం కాబట్టే ప్రజలకు పథకాల ద్వారా సహాయం అందజేశామన్నారు. తద్వారా అదే డబ్బును మళ్లీ ఎకానమీలోకి పంపించామని చెప్పారు. డబ్బు అవసరం ఉన్నందునే అప్పు చేశామనే విషయాన్ని గర్వంగా చెబుతున్నామని దీనిలో దాపరికమేమీ లేదన్నారు. విపక్షాలు మాట్లాడేందుకు ఏమీ లేకపోవడంతో అప్పులంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర ఆర్థిక రంగం క్రమంగా పుంజుకుంటోందని తెలిపారు. గతం కంటే కేంద్రం నుంచి ఎక్కువగానే నిధులు తెచ్చుకున్నామన్నారు. కర్నూలు ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు తనపై తప్పుడు ఆరోపణలను చేశారని అన్నారు. వందేళ్లుగా తమ కుటుంబం మైనింగ్ రంగంలో ఉందన్నారు. అవినీతిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తానిప్పటికే పాత కారే వాడుతున్నానని, అపార్టుమెంట్లోనే ఉంటున్నట్లు స్పష్టం చేశారు.













