కేంద్ర ఆర్థిక మంత్రితో బుగ్గన భేటీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో ఆంధప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చ జరిపారు. ఈ భేటీలో ఆంధప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ బకాయిలు, విభజన చట్టంలో పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ కొవిడ్ కారణంగా రాష్ట్ర అంశాలపై కేంద్రంతో చర్చించే అవకాశం చిక్కలేదన్నారు. కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయని అన్నారు. పన్ను వసూళ్లలో గత 3 నెలల్లో 40 శాతం లోటు ఏర్పడింది. జీఎస్టీ బకాయిలు రూ.300 కోట్లు రావాల్సి ఉంది. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలతో పాటు, అదనంగా నిధులిచ్చి సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాము అని బుగ్గన వెల్లడించారు.













