ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. అందుకే బుద్ధా అలా అన్నాడా?
2019 ఎన్నికల ఓటమి తర్వాత టీడీపీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. మరి ముఖ్యంగా 2024 ఎన్నికలలో గెలవకపోతే ఇక టీడీపీ వారసత్వ పోరుకి ఆంధ్రాలో ఎండ్ కార్డు పడినట్లే అని అందరూ భావించారు. అయితే ఎంతో వ్యూహాత్మకంగా కూటమిని కలుపుకుంటూ ముందుకు సాగిన చంద్రబాబు.. జగన్ ఎత్తులను చిత్తు చేస్తూ 164 సీట్లు కైవసం చేసుకొని విజయ డంకా మోగించారు. 2024 ఎన్నికల ఫలితాలు టీడీపీ వైపు మొగ్గు చూపడానికి లోకేష్ ఒక ప్రధాన కారణం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రా పప్పు అని ఎందరు అవహేళన చేసినా.. మాటలు తడబడే వాడు రాజకీయం ఏం చేస్తాడు అని ఎద్దేవా చేసినా.. వెనక్కి తగ్గకుండా యువ గళం అంటూ తన గళాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వినిపించారు. మాటల తూటాలతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతూ చంద్రబాబుకు తగ్గ వారసుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు లోకేష్.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ మరొక పదేళ్లపాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ప్రజలు పట్టం కట్టిన విజయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రాగలిగితే 2029 ఎన్నికల్లో కూడా గెలుపు కూటమికే దక్కుతుంది. రాబోయే ఐదు సంవత్సరాలలో లోకేష్ మరింత బలంగా రాజకీయాలలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం కన్ఫామ్. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చంద్రబాబు, కూటమి ఒప్పందంలో భాగంగా ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నప్పటికీ లోకేష్ స్థానం వీరిలో ఎవరికీ తీసిపోదనే చెప్పాలి. అంతా సజావుగా జరుగుతున్న నేపథ్యంలో బుద్ధా వెంకన్న మరొక కాంట్రవర్సీకి తెర లేపారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ బుద్ధా.. తాను పని చేస్తే చంద్రబాబు, భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, ఆఖరుకు దేవాన్ష్ నాయకత్వంలో మాత్రమే పని చేస్తాను తప్ప వేరే ఒకరి వద్ద పనిచేసే అవసరమే లేదు అని ఖరాఖండిగా చెప్పారు.
అయితే ప్రస్తుతం ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక పరమార్థం ఏమిటో అన్న విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.ఇక్కడ బుద్ధా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి మాట్లాడారా లేక జూనియర్ ఎన్టీఆర్ ని దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు అన్నారా అన్న విషయం పై క్లారిటీ లేదు. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారేమో.. అందుకే ఆయన ఇంత వైలెంట్ గా రియాక్ట్ అయ్యారేమో అని భావించేవారు కూడా ఉన్నారు. మొత్తానికి నందమూరి తారక రామారావు గారి రాజకీయ వారసుడు అంటే లోకేష్ మాత్రమే అనే విధంగా బుద్ధా ఇచ్చిన ఈ స్టేట్మెంట్ పై నందమూరి కుటుంబం, జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.













