ఆయన పాలన నచ్చకే ప్రపంచబ్యాంక్ వెనక్కి
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలన నచ్చనందు వల్లనే రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంక్ వెనక్కు వెళ్లిపోయిందని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకటేశ్వరరావు (వెంకన్న) ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనపై ఎవరికి నమ్మకం లేదని ఈ కారణంగానే పరిశ్రమలు వెనక్కి వెళుతున్నాయని విమర్శించారు. రాష్ట్రం విడిపోయాక రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌కు అప్పులే మిగిలాయని, విడిపోయిన తెలంగాణకు ఆస్తులు దక్కాయని అన్నారు. అయినా చంద్రబాబునాయుడుకు ఉన్న ఇమేజ్, దూరదృష్టి వల్ల ఆయనపై నమ్మకంతో రైతులు రాజధానికి వేలాది ఎకరాలను ఇచ్చారని అన్నారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే ప్రపంచబ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడిబి) రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని అన్నారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనించాక రుణం మంజూరు విషయంలో ప్రపంచబ్యాంక్ వెనక్కి వెళ్లిందన్నారు.













