వారిని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ద్వారా.. దేశం దాటేలా
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులతో చంద్రబాబు నిత్యం మాట్లాడుతూ, వారిని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ద్వారా సురక్షితంగా దేశం దాటే చర్యలు తీసుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర కార్వనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు, అనుకోని ఉప్రదవాలు ఎదురైనప్పుడు ప్రజలకు అండగా నిలిచి, వారిని కాపాడటం అనేది చంద్రబాబుకి తెలిసినంతగా జగన్‌కు తెలియదని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు స్పందించినంత బాధ్యతగా, వేగంగా ఎవరూ స్పందించలేరన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించడానికి ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రేమో విద్యార్థుల తరలింపునకు కమిటీ వేశారు. కేంద్ర మంత్రికి లేఖ రాశారు. చేతులు దులుపుకున్నారు. జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో వీడియో గేమ్‌లు ఆడుకుంటూ కూర్చుంటే విద్యార్థులు క్షేమంగా తిరిగొస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ముందుచూపు, పట్టుదల వల్ల తెలుగు రాష్ట్రాల విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 1500 మంది సురక్షితంగా ఉక్రెయిన్ నుంచి బయటపడ్డారు అని అన్నారు.













