సీఎం జగన్ ను కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుకు అవసరమైన సహకారం అందిస్తామని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ హామీ ఇచ్చారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. బ్రిటన్లో అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్లోనూ ప్రారంభించడం, విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలను ఆయన ప్రశంసించారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వ్యవసాయరంగంలో ఏపీ అనుసరిస్తున్న విధానాలను ఆసక్తిగా తెలుసుకున్నారని, ఉపాధ్యాయుల శిక్షణకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు వివరించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, పారిశ్రామిక పార్కుల పురోగతిని సీఎం జగన్ వివరించారని పేర్కొంది. కార్యక్రమంలో బ్రిటిష్ కమిషన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ వరుణ్మాలి, పోలిటికల్ ఎకానమీ సలహాదారు నళిని రఘురామన్, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి పాల్గొన్నారు.













