విద్య, వైద్యంలో ఏపీ విధానాన్ని ప్రశంసించిన బ్రిటన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలు అద్భుతమని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ హెచ్ ఈ గారెత్ విన్ ఓవెన్ చెప్పారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలోని 104, 108 కాల్ సెంటర్లను సందర్శించానని, అవి అద్భుతంగా పనిచేస్తున్నాయని, ఇలాంటి వ్యవస్థలను బ్రిటన్‌లోనూ నెలకొల్పేలా చూస్తామన్నారు.
బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో 104, 108 కాల్‌సెంటర్ల గురించి ప్రచురిస్తామన్నారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్, ఆయన బృందం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఏపీఈడీబీ సీఈవో డాక్టర్ నారాయణ భరత్ గుప్తాతో ఇటీవల విడివిడిగా సమావేశమైంది. రాష్ట్రంలో విద్య వైద్య రంగాలపై చర్చించి, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని వెల్లడిరచింది. ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి రజిని బృందానికి వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య రంగంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. రాష్ట్రంలో అమలు చేయనున్న ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని వివరించారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగం బలోపేతానికి రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, ఆరోగ్యశ్రీ సహా పలు కార్యక్రమాలతో విద్య, వైద్య రంగాల్లో సీఎం జగన్ సమూల మార్పులు తెస్తున్నారని వివరించారు. యూకేలోనూ ఫ్యామిలీ డాక్టర్ లాంటి విధానాన్నే అమలు చేస్తున్నట్లు ఓవెన్ చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానానికి సహకారం అందిస్తామని అన్నారు. ఏపీ ప్రభుత్వం క్యాన్సర్ వైద్యంలో అత్యాధునిక పద్ధతులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని, తాము కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. యూకే – భారత్ విద్యార్థుల పరస్పర మార్పిడి విధానం వల్ల భారత యువతకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. ఏపీ నుంచి ఎక్కువ మంది విద్యార్థులకు బ్రిటన్ వీసాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జీఎస్ నవీన్‌కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్, ఏపీవీవీపీ కమిషనర్, ఇన్చార్జి డీఎంఈ డాక్టర్ వినోద్ కుమార్, బ్రిటిష్ కమిషనరేట్ నుంచి డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ వరుణ్ మాలి, పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నళిని రఘురామన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యా పథకాలకు ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాలను గారెత్ విన్ ఓవెన్ బృందం ప్రశంసించింది. ఈ బృందం ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె. హేమచంద్రారెడ్డితో భేటీ అయింది. వైఎస్ జగన్ ప్రభుత్వం 3 సంవత్సరాల్లో చేపట్టిన కార్యక్రమాలను హేమచంద్రారెడ్డి వివరించారు. పరిశ్రమలతో విద్యా సంస్థల అనుసంధానం, విద్యార్థులకు 10 నెలల ఇంటర్న్‌షిప్, దాని వల్ల ప్రయోజనాలను చెప్పారు. రాష్ట్రం బ్లెండెడ్ మోడ్ ఆఫ్ లెర్నింగ్ దిశగా పయనిస్తోందని, ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీలతో మారుమూల ప్రాంతాలకు విజ్ఞానం వ్యాప్తి చెందుతుందని చెప్పారు. ప్రభుత్వ విద్యా కార్యక్రమాలు, ప్రయోజనాలను తెలుసుకుని బృందం సభ్యులు ఆశ్చర్యపోయారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశోధన రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌తో భాగస్వామ్యంపై బ్రిటన్ ఆసక్తిని వ్యక్తంచేసింది. విశాఖపట్నంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండస్ట్రీ 4.0లో భాగస్వామ్యానికి బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ సానుకూలత వ్యక్తంచేశారు. ఏపీఈడీబీ సీఈవో డాక్టర్ నారాయణ భరత్ గుప్తాని కలిసి రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కుల్లో భాగస్వామ్యానికి గారెత్ ఆసక్తిని కనబరిచారు.













