సీఎం వైఎస్ జగన్ తో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్ బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ (ఏపీ, తెలంగాణ) డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటీష్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ హెడ్ వరుణ్ మాలి, పలువురు బృంద సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధిని వివరించి, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఆ బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించింది. అనంతరం డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌ను ముఖ్యమంత్రి సత్కరించి జ్ఞాపిక అందజేశారు.













