ఏ మాత్రం తగ్గలేదు.. 2019 కంటే మెరుగైన ఫలితాలు
అమ్మఒడి పథకాన్ని అర్హులందరికీ ఇస్తున్నామని, ఈ పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో అమృత్ పథకంలో భాగంగా 1.96 కోట్ల వ్యయంతో నిర్మించిన వాటర్ స్టోరేజ్ ట్యాంక్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ అమ్మఒడి లబ్దిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవమని, పాఠశాల హాజరు ఆధారంగానే ఎంపికీ జరిగిందని అన్నారు. పిల్లలను సక్రమంగా స్కూల్‌కి పంపితే పథకం వర్తిస్తుందని అన్నారు. విజయనగరంలో ప్రతి ఇంటికీ కొళాయి కలెక్షన్ మంజూరు చేయాలనే లక్ష్యంతో నగర పాలక సంస్థ, ప్రజా ప్రతినిధులు పనిచేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. ఇంటర్లో ఫలితాలు ఏమాత్రం తగ్గలేదని, 2019 కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయని అన్నారు. పాఠశాల, కళాశాలల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.













