మంత్రుల వ్యాఖ్యలు.. మరెన్నో ఊహాగానాలు…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం తాజా అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న దగ్గర్నుంచి రాష్ట్రంలో రాజధాని విషయం మీద రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయా ఊహాగానాలకు మంత్రుల వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కరోనా విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా ప్రస్తుతానికి రాజధాని తరలింపు ఆలోచన లేదని చెప్పారు. కరోనా వ్యాప్తి ఇంకా ఇంకా పెరిగి జూలై నాటికి కరోనా కేసులు ఇప్పుడున్న దానికి మూడింతలు పెరిగే అవకాశముందని ఇలాంటి పరిస్తితుల్లో రాజధాని తరలింపు సాధ్యం కాకపోవచ్చునని ఆయన అంటున్నారు. రాష్ట్ర గవర్నర్ తన ప్రసంగంలో కూడా మూడురాజధానులని ప్రస్తావించారని, అయితే రాజధానిపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం రాజధాని నగరమైన అమరావతిలో పర్యటించారు. అంతేకాదు… అమరావతిలో ఆగిపోయిన పలు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. దీనిలో భాగంగా ఆలిండియా సర్వీస్ క్వార్టర్స్, ఎన్జీవో, హెచ్ఓడీల క్వార్టర్స్ ను సందర్శించి, పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన వెంట సీఆర్డీఏ అధికారులు ఉన్నారు. పర్యటన అనంతరం సీఆర్డీఏ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో కూడా ఆయన సమావేశమయ్యారు. పలు విషయాలపై వారితో చర్చించారు. మరోవైపు, బొత్స పర్యటనపై అమరాతి రైతుల్లో ఆసక్తి నెలకొంది. రాజధానిగా అమరావతినే కొనసాగించే అవకాశం ఉందా? అని కూడా కొందరు చర్చించుకుంటున్నారు. మరోవైపు రాజధాని తరలింపు ప్రకటనలపై సిపిఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ఓ వైపు రాజధాని అంశం హైకోర్టు పరిధిలో ఉండగా మంత్రులు వ్యాఖ్యలు చేయడం కోర్టు థిక్కారమే అవుతుందని ఆయన హెచ్చరించారు. 3 రాజధానుల బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందలేదని గుర్తు చేశారు.













