Botsa Satyanarayana: రామతీర్థం ఘటనలో నిందితుడికి కూటమి సాయం పై బొత్స ఫైర్..
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. రామతీర్థం (Ramathirtham) ఆలయంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుడికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందిందని ఆయన ఆరోపణలు చేశారు. మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) చేతుల మీదుగా ఆ సాయం అందించడం పట్ల బొత్స సీరియస్‌గా స్పందించారు. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బొత్స వ్యాఖ్యల ప్రకారం, మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఇలా సాయం చేయడం ద్వారా ప్రభుత్వం ప్రజల సొమ్మును తగిన విధంగా వినియోగించలేదని పేర్కొన్నారు. ఒకవేళ ఆ వ్యక్తి నిందితుడు కాదని ప్రభుత్వం భావిస్తే, విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని, నిజమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. కానీ, ప్రభుత్వం అలా చేయకుండా నిందితుడికి డబ్బు అందించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక ఈ అంశంపై బీజేపీ ,జనసేన పార్టీలు మౌనంగా ఉన్నాయని బొత్స విమర్శలు గుప్పించారు. రామతీర్థం ఘటనకు అప్పట్లో తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. హిందూ మతాన్ని రక్షించే బాధ్యత వీరిదేనని చెబుతుంటే, ఇప్పుడున్న పరిస్థితులపై ఎందుకు స్పందించడంలేదని బొత్స అడిగారు.
అంతేకాకుండా, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై కూడా బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాల్సిన అవసరం ఉందని, ప్రజల ఆశలను వమ్ము చేయరాదని చెప్పారు. విజయవాడలో వరదలు, తిరుమలలో తొక్కిసలాట వంటి ఘటనలపై ప్రభుత్వం మానవ తప్పిదాల వల్లే జరిగినట్లు తేల్చడం సరికాదన్నారు.
ఇదిలా ఉంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ముహూర్తం పెట్టినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. కూటమి సర్కారు దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి బొత్స చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను ఉర్రూతలూగించగా, దీనిపై సీఎం చంద్రబాబు సహా ప్రభుత్వంలోని నేతలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













