వాళ్లు ఎప్పుడు చర్చకు వస్తామంటే.. అప్పుడే : బొత్స
చర్చలతోనే సమస్య పరిష్కారం అవుతుందనే విషయం ఉద్యోగులు గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులను చర్చలకు పిలిచినా పీఆర్సీ సాధన కమిటీ వాళ్లు చర్చలకు రాకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. తాము చర్చలకు రమ్మంటే అలుసుగా తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మాట్లాడకుండా ఇంట్లోనే కూర్చుంటామంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా పీఆర్సీ ఇచ్చామని వెల్లడించారు. జీతాలు పెరుగుతాయా, తగ్గుతాయా అనేది పే స్లిప్ చూసుకోవాలని సూచించారు. ఉద్యోగుల జీవితాల్లో ఒక్క రూపాయి కూడా తగ్గదని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు సహా రాష్ట్రంలోని ఏ ఉద్యోగి ముందుకొచ్చినా మాట్లాడేందుకు సిద్ధమని తెలిపారు.
ఉద్యోగుల సమస్య అంటే ప్రభుత్వానికి సమ్య ఉన్నట్లేనని వ్యాఖ్యానించారు. ఘర్షణ వాతావరణం వద్దు చర్చలకు రావాలని కోరుతున్నామని వెల్లడించారు. ఉద్యోగులు ఎప్పుడు వస్తామంటే అప్పుడు చర్చలకు సిద్ధమని తెలిపారు.
ఉద్యోగ సంఘాలు కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇకపై రోజూ వచ్చి సచివాలయంలో ఎదురు చూడమని, ఉద్యోగ సంఘాలు పిలిస్తేనే చర్చలకు వస్తామని స్పష్టం చేశారు.













