విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలనేదే ప్రభుత్వ ఆకాంక్ష: బొత్స
ఏపీలో విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. నూతన విద్యా విధానంపై గురువారం హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన 17 కోర్సుల పాఠ్య పుస్తకాలను అందించారు. విద్యార్థులకు శిక్షణ కోసం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్తో విద్యాశాఖ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో బొత్స మాట్లాడుతూ.. కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఉద్యోగాలు పొందేందుకు కావలసిన నైపుణ్యాలను కలిగి ఉండేలా స్కిల్ డెవెలప్మెంట్కు ప్రాధాన్యం ఇస్తున్నామని, పరిశ్రమలతో సహా అన్ని రంగాల్లో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఇందుకోసమే మంత్రివర్గంలో ప్రత్యేక పోర్ట్ ఫోలియోను సిద్ధం చేశామని తెలిపారు. నూతన విద్యావిధానాన్ని అమలు చేయడంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. ఏపీ విద్యార్థులంటే గ్లోబల్ స్టూడెంట్ అనిపించుకోవాలని, అందుకే ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్‌ను ప్రవేశ పెట్టినట్లు పేర్కొన్నారు. విద్యార్థులపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి పైసాను వినియోగించుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.













