మూడు రాజధానులపై త్వరలోనే బిల్లు : మంత్రి బొత్స
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, పరిపాలన వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అంశాలపై మరోసారి చర్చించి త్వరలోనే బిల్లు పెడతామని అన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలోనే ఉందని, స్వయంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ప్రకటించారని గుర్తు చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులను కలిసిన సమయంలో మఖ్యమంత్రి జగన్ ప్రస్తావిస్తూనే ఉన్నారని తెలిపారు. ప్రత్యేక హోదా సాధించేవరకూ పోరాటం చేస్తామని పేర్కొన్నారు.













