ఉనికిని కాపాడుకోవటానికే బీజేపీ తాపత్రయం : మంత్రి బొత్స
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉనికిని కాపాడుకొనేందుకు బీజేపీ తాపత్రయపడుతోందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నా, ఏపీలో ఆ పార్టీ లేదన్నారు. రాజకీయ పార్టీ కాబట్టి బహిరంగ సభ నిర్వహించుకుంటోందన్నారు. ఉనికి కాపాడుకోవడానికి పెట్టే సభ తప్ప ఏమీ ఉపయోగం లేదన్నారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు జగన్ పరిపాలన బాగోలేదని గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. ఏదైనా ఒక సమస్యపై ప్రత్యేకంగా సూచన చేస్తే స్వీకరిస్తాం తప్ప ఆ పార్టీ నేతలు ఇష్టానుసారం మాట్లాడితే ఎలా అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో నీతి అయోగ్ నివేదిక చూస్తే సరిపోతుందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూసుకోవాలంటూ చురకలంటించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఎందుకు వెనుకుబాటులో ఉందో ముందు దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన హామీలు ఎంత వరకు కేంద్రం నెరవేర్చిందో బీజేపీ చూసుకోవాలన్నారు.













