జనసేన ఒక పార్టీనే కాదు.. బొత్స సంచలన వ్యాఖ్యలు
ఏపీ పరిపాలనా రాజధాని విశాఖకు వచ్చి తీరుతుందని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖకు పరిపాలనా రాజధాని విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో విశాఖకు పరిపాలనా రాజధాని రావాలన్న కోరిక చాలా బలంగా ఉందన్నారు. శనివారం జరిగిన విశాఖ గర్జనలో ఈ విషయంపై మరోమారు స్పష్టమైందని బొత్స చెప్పారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీలపై ఆయన విమర్శలు గుప్పించారు. విశాఖకు పరిపాలనా రాజధాని తీసుకురావాలని తాము కష్టపడుతుంటే.. టీడీపీ, జేనసేన ఈ ప్రయత్నాలను అడ్డుకుంటున్నాయని బొత్స ఆరోపించారు. అసలు మూడు రాజధానుల విషయంలో ఈ పార్టీలకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. విశాఖకు వ్యతిరేకంగా ఈ పార్టీలు ఆదుతున్న ఆటలు ఇకపై సాగవన్నారు. జనసేన అసలు ఓ రాజకీయ పార్టీనే కాదన్న బొత్స.. అది ఒక వ్యక్తి పెట్టుకున్న సంస్థ అన్నారు.













