రిషికొండపై నిర్మాణాలతో నష్టమేంటి.. విపక్షాలకు మంత్రి బొత్స ప్రశ్న..
విశాఖ పరిధిలోని రిషికొండపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని విపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రిషికొండపై జరుగుతున్న ప్రభుత్వ నిర్మాణాలతో మీకు నష్టమేంటని ప్రశ్నించారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన పూర్తయిన తర్వాత బొత్స మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, వైసీపీ ఎంపీ సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిషికొండపై నిర్మాణాల గురించి మాట్లాడారు. కొండపై ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలతో ప్రతిపక్షాలకు నష్టమేంటని అడిగారు. రిషికొండపై గతంలో కూడా నిర్మాణాలు ఉన్నాయని గుర్తు చేశారు. రిషికొండపై నిర్మాణాలు జరుగుతున్న మాట వాస్తవేమనని, కానీ అవి ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగుతున్నాయని, వీటిపై విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, వారి ప్రచారాలకు పచ్చ మీడియా కొంగుకాస్తూ ప్రజలకు సమస్యను పెద్దగా చేసిన చూపుతున్నాయని ఆయన విమర్శలు చేశారు. అనంతరం ‘ప్రధాని సభలో పాల్గొని రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న సీఎం వైస్ జగన్‌కు నా హాట్సాఫ్’ అని బొత్స అన్నారు. ప్రజల సమస్యలను, వారి అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం వచ్చేలా సీఎం కృషి చేస్తారని అన్నారు. కానీ రాష్ట్రంలో కొందరికి మాత్రం తమ స్వలాభాలు, స్వప్రయోజనాలే కీలకమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాటుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బొత్స వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆదివారం ఉదయం జనసేనాని విజయనగం వెళ్తారట, అక్కడ జగనన్న కాలనీలను సందర్శిస్తారట అంటూ వ్యంగ్యంగా చురకలంటించారు. విజయనగరం జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 400 ఎకరాల్లో 12 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని అన్నారు. కానీ విపక్షాలు మాత్రం పేదల ఇళ్లపై కూడా రాజకీయమే చేస్తున్నారని దుయ్యబట్టారు.













