Bonda Vs Pawan : పవన్‌పై బొండా ఉమ బురద జల్లుతున్నారా..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly) సమావేశాలకు విపక్ష వైసీపీ హాజరు కావట్లేదు. అధికార కూటమిలో భాగస్వాములైన టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) సభ్యులు మాత్రమే సభకు హాజరవుతున్నారు. అయినా సభ్యులు ప్రభుత్వాన్ని, మంత్రులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో పలువురు సభ్యులు మంత్రులకు సూటిగా ప్రశ్నలు సంధించారు. టీడీపీ సభ్యులు బొండా ఉమ (Bonda Uma), నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Dy CM Pawan Kalyan) ను టార్గెట్ గా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది కూటమిలో (NDA) చిచ్చుకు కారణమైంది. బొండా ఉమా వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పవన్ కల్యాణ్, వెంటనే చర్యలకు ఉపక్రమించారు.
రాష్ట్రంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Pollution Control Board) ఉందో లేదో తెలియడం లేదని, ఎప్పుడు వెళ్లినా పనులు జరగట్లేదని బొండా ఉమా అసెంబ్లీలో ఆరోపించారు. పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) చైర్మన్ ప్రతి దానికీ ఉప ముఖ్యమంత్రి పేరు చెప్తున్నారని, ఆయన కార్యాలయం చెప్తే ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారని ఉమ అన్నారు. రాంకీ లాంటి సంస్థలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నా చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు. అలాంటి వాళ్లను ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. పీసీబీ ఛైర్మన్ ప్రభావితమవుతున్నారా.. అని అనుమానాలు వ్యక్తం చేశారు. బొండా ఉమా వ్యాఖ్యలు అసెంబ్లీలో కలకలం రేపాయి.
బొండా ఉమా వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంటనే స్పందించారు. పీసీబీని అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ముగిసిన అనంతరం పీసీబీతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. బొండా ఉమా ఆరోపణలపై ఆరా తీశారు. బొండా ఉమా నియోజకవర్గంలో క్రెబ్స్ బయో కెమికల్స్ కంపెనీ కాలుష్యాన్ని వెదజల్లుతోందంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో పీసీబీకి ఫిర్యాదు చేశారు. విశాఖలో రాంకీ తరహాలోనే విజయవాడలో క్రెబ్స్ కాలుష్యానికి కారణమవుతోందని చెప్పారు. బొండా కుమారుడు ఇదే అంశంపై హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ అంశంపై పీసీబీ విచారణ జరిపి క్రెబ్స్ పై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసింది. తీరా చర్యలు ప్రారంభించిన తర్వాత బొండా ఉమా అడ్డుపడుతున్నారని పీసీబీ, పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకొచ్చింది. ఆ కంపెనీపై చర్యలు తీసుకోవద్దని చెప్తున్నారని డిప్యూటీ సీఎంకు తెలియజేసింది. దీంతో ఆశ్చర్యపోయిన పవన్ కల్యాణ్, ఈ అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు.
బొండా ఉమ అసెంబ్లీలో నేరుగా పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ ఆరోపణలు చేయడంతో ఇటు టీడీపీ, అటు జనసేన సభ్యులు ఆశ్చర్యపోయారు. బొండా ఉమ ఏ ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేశారనేది తెలీదు. అయితే శాఖాపరంగా ఆయన చేసిన ఆరోపణలకు బదులివ్వాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే పీసీబీతో సమావేశమైన పవన్ కల్యాణ్, వెంటనే ఆ అంశంపై నివేదిక కోరారు. వచ్చేవారం అసెంబ్లీలోనే బొండా ఉమకు సమాధానమిచ్చేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పైగా, మొదట ఫిర్యాదు చేసి, ఆ తర్వాత చర్యలు తీసుకోవద్దంటూ ప్లేట్ ఫిరాయించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో జనసేనాని ఉన్నట్టు సమాచారం. మొత్తానికి బొండా ఉమ వ్యాఖ్యలు టీడీపీ, జనసేన మధ్య ఉద్రిక్తతలకు కారణమైనట్లు తెలుస్తోంది.