ఆ పార్టీ అరాచకాలపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు : బొండా ఉమా
వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని తెలిసే అరాచకాలకు పాల్పడుతోందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యర్థుల ఫోన్లు అక్రమంగా వినడం న్యాయమా? అని ప్రశ్నించారు. జగన్, పెద్దిరెడ్డి, సజ్జల ఆదేశాలు పాటించే ఇదంతా చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం నిరంతరం ట్యాపింగ్ చేస్తోందని, తమతో పాటు అధికారుల ఫోన్లపైనా నిఘా ఉంచారని ఆరోపించారు. మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్లే ఇందుకు నిదర్శనమన్నారు. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలతో గెలవాలని వైసీపీ చూస్తోందన్నారు. ఆ పార్టీ అరాచకాలపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.













