మనం ఏపీలో ఉన్నామా? లేక పాకిస్థాన్లో ఉన్నామా?
హౌస్ అరెస్టులపై ప్రభుత్వం చూపిస్తునన ఉత్సాహం దాడులు జరిగిన గ్రామాల్లో చూపించి ఉంటే బాగుండేదని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. బాధితులకు అండగా ఉండేందుకు ఎంతవరకైనా వెళతామని ఆయన సృష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రజల పక్షాన నిలుస్తుందని, పాలకపక్షం తప్పులను ఎత్తి చూపుతుందని అన్నారు. టీడీపీ పార్టీ గొంతు నొక్కడానికి వైసీపీ ప్రభుత్వం చూస్తోందని ఆయన విమర్శించారు. తమ అధినేత చంద్రబాబు పిలుపు ఇచ్చిన ఛలో ఆత్మకూరు కార్యక్రమం జరగకుండా ప్రభుత్వం అడుగడుగున టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేస్తుందని మండిపడ్డారు. మూడు నెలల నుంచి టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నప్పుడు బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటే ఉద్రిక్తతలకు దారితీసేది కాదని అన్నారు. రోజుకొక గ్రామంలో వైసీపీ శ్రేణులు దాడులు చేస్తుంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా? లేక పాకిస్థాన్లో ఉన్నామా అని ఆయన ప్రశ్నించారు.













