వైసీపీ నేతల ప్రమేయంపై జగన్ మౌనమెందుకు ? : బోండా ఉమ
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య లో వైసీపీ నేతల ప్రమేయంపై సీఎం జగన్ మౌనమెందుకు? అని తెలుగుదేశం పార్టీ నేత బొండా ఉమా ప్రశ్నించారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసులో నిందితులను కాపాడేందుకు జగన్ యత్నిస్తున్నారని ఆరోపించారు. సొంత బాబాయిని చంపిన వారిని శిక్షించాల్సింది పోయి సీబీఐ విచారణను జగన్ ఉపసంహరించుకున్నారని అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డేనని ఆయన పునరుద్ఘాటించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోరిన జగన్ ఇప్పుడు పిటిషన్ ఉపసంహరించుకోవడానికి కారణమేంటో చెప్పాలన్నారు. సాక్ష్యాలతో బయటపడి అడ్డంగా దొరికి పోయిన కూడా వైసీపీ నేతలు బుకాయిస్తున్నారు. సీఎం చిన్నాన్న మరణాన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తారా? అని ప్రశ్నించారు.
అవినాష్‌రెడ్డిని కాపాడుకోవడానికి జగన్ చేయని ప్రయత్నం లేదు. వివేకా హత్య జరిగిన రోజు నుంచి ఆయనది రోజుకో మాట. అవినాష్ కోసం జగన్ ఢల్లీికి ఎన్నిసార్లు వెళ్తున్నారో లెక్కే లేదు. వివేకా హత్య కేసు వివరాలను సీబీఐ సగమే వెలికితీసింది. సాక్ష్యాలు దొరక్కుండా నిందితులు జాగ్రత్తపడ్డారు. అవినాష్ రెడ్డి నాటకాలాడి మాపై విషప్రచారం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక గెలుపు కోసం వాడుకున్నారు. అధికారంలోకి వచ్చాక కేసునే తప్పుదారి పట్టించేందుకు యత్నించారు అని ఆరోపించారు.













