Pulivendula: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న పులివెందుల బోగస్ పెన్షన్లు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాజిక భద్రత పథకాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా పెన్షన్ లబ్ధిదారుల కోసం తీసుకున్న నిర్ణయాలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ప్రమాణ స్వీకారం చేసిన రోజే వృద్ధాప్య, వితంతు పెన్షన్లను ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెంచి రూ.4,000కి చేర్చగా, వికలాంగులకు ఇచ్చే పింఛనును రూ.3,000 నుంచి నేరుగా రూ.6,000కి పెంచారు. ఈ పెంపుతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేసినా, వికలాంగుల విభాగంలో పెద్ద ఎత్తున నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయనే అనుమానం ప్రభుత్వానికి కలిగింది.
ప్రస్తుతం సుమారు 7 లక్షల మంది వికలాంగులు పెన్షన్ పొందుతున్నారు. వీరిలో 5.10 లక్షల మంది తమ సర్టిఫికెట్లను తిరిగి ధృవీకరించించుకున్నారు. పరిశీలనలో దాదాపు లక్ష వరకు నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇంతకాలం అర్హతలేని వారు కూడా పెన్షన్ పొందుతున్నారని తేలింది. మరోవైపు ఇంకా 60 వేల మంది తమ సర్టిఫికెట్లు రీచెక్ చేయించుకోలేదని సమాచారం. వీరిపై ప్రభుత్వానికి అనుమానాలు ఎక్కువయ్యాయి.
గత ప్రభుత్వం కాలంలోనే ఇష్టానుసారం సర్టిఫికెట్లు జారీ అయ్యాయని, ముఖ్యంగా రాజకీయ ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గాల్లో అర్హతలేని వారికి లబ్ధి చేకూరిందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. రాష్ట్ర సమాచార మంత్రి కొల్లు పార్థసారథి (Kollu Parthasaradhi) వెల్లడించిన వివరాల ప్రకారం, పులివెందుల (Pulivendula) నియోజకవర్గంలోనే 1,708 బోగస్ పెన్షన్లు గుర్తించబడ్డాయి. ఈ నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ప్రాతినిధ్యం వహించటం వల్ల ఈ విషయం మరింత రాజకీయంగా మారింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మాత్రం దీనిపై తీవ్రంగా స్పందిస్తోంది. నిజమైన లబ్ధిదారుల పింఛన్లు కూడా కోతపెట్టబడుతున్నాయని విమర్శిస్తోంది. అయితే అధికార కూటమి మాత్రం నకిలీ సర్టిఫికెట్లు ఉన్నవారిని మాత్రమే తొలగిస్తున్నామని, నిజమైన వికలాంగులు ఎలాంటి ఇబ్బందులు పడరని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ, ఆ 60 వేల మందికి నోటీసులు జారీ చేసి మరోసారి ధృవీకరణ చేయించుకోవాలని ఆదేశాలు ఇవ్వబోతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో సెప్టెంబర్ నాటికి దాదాపు 1.60 లక్షల పింఛన్లు నిలిచిపోవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇందులో నకిలీ సర్టిఫికెట్లు వాడినవారు ఎంతమంది? అర్హతలున్నవారు ఎంతమంది? అన్న ప్రశ్నలు ఇంకా సమాధానం దొరకకుండానే ఉన్నాయి. మరోవైపు, నకిలీ సర్టిఫికెట్లను వాడినవారిపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశముందా లేదా అన్నది కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి వికలాంగ పింఛన్ల మంజూరులో డాక్టర్ల కమిటీ ఇచ్చిన సర్టిఫికెట్లే ప్రాధాన్యం పొందుతాయి. అయితే గతంలో ఆ సర్టిఫికెట్ల జారీ విధానంలోనే అవకతకలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగా ఆ సర్టిఫికెట్లను తిరిగి పరిశీలించక తప్పని పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి నకిలీ సర్టిఫికెట్ల తొలగింపుతో నిజమైన లబ్ధిదారులు సంతోషపడుతుండగా, రాజకీయ వర్గాల్లో మాత్రం దీనిపై దుమారం మచ్చిక అవుతోంది.







