సీనియర్లకు పట్టం కడుతున్న బీజేపీ..
ఒకప్పుడు రాజకీయాలలో తలలు పండిన నేతలు దండిగా ఉండేవారు. వారి అనుభవాలే పాఠాలుగా పార్టీలు ముందుకు కదిలేవు. అయితే ఉరకలు వేస్తున్న కుర్ర కారుకి ప్రాధాన్యత ఇవ్వడం రీసెంట్ గా ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలలో బీజేపీ సరికొత్త ట్రెండ్ సెట్టర్‌గా మారబోతోంది. ఈసారి వయసుతో సంబంధం లేకుండా కురువృద్ధులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది ఈ పార్టీ. సీనియర్లను ఎన్నికల్లో ముందుపెట్టి వెనక నుంచి వ్యూహాత్మకంగా విజయం దక్కించుకోవడానికి బీజేపీ చూస్తోందని టాక్. కూటమి కన్ఫర్మ్ అయ్యాక 6 పార్లమెంట్ సీట్లతో పాటు 10 అసెంబ్లీ సీట్లు బీజేపీ ఖాతాలోకి వచ్చాయి. ఈ సీట్లకు ఎవరు పోటీ చేస్తారు అన్న విషయంపై గత కొద్ది కాలంగా కసరత్తులు జరుగుతున్నాయి. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లకు అవకాశాలు ఇవ్వడం లేదు అన్న ఆరోపణలు బీజేపీ లో ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో.. పాత వారికి అవకాశం ఇవ్వడానికి పార్టీ నిర్ణయించుకుంది. కొత్తగా పార్టీలో వచ్చిన వారికి అవకాశాలు కల్పిస్తూ.. ముందుకు సాగుతున్న బీజేపీ ఇప్పుడు కుల వృద్ధులకు పట్టం కట్టబోతోంది. అలాగే ఏదో ఒక సీటు అన్న విధంగా కాకుండా కచ్చితంగా గెలుస్తాము అన్న ధీమా ఉన్న సీట్లని టీడీపీ నుంచి తీసుకోవడానికి అధిష్టానం నిర్ణయించుకుందట. దీంతో బిజెపి ఖాతాలోకి రాబోయే ఆ 10 సీట్లు హాట్ కేకులు కాబోతున్నాయి. పది సీట్ల కోసం ఓ పెద్ద జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. మరి ఈ సీట్లను ఎవరు దక్కించుకుంటారు అనే విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.













