రామమందిరం పట్టని టీటీడీ..భాజాపా ఆగ్రహం
అయోధ్యలో రామమందిర నిర్మాణం. దశాబ్ధాల తరబడి హిందువుల కల. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల నిరీక్షణ ఫలించిన రోజు. రామజన్మభూమి అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలోనే అది పెద్ద ఆలయాల్లో 3వదైన రామ మందిర నిర్మాణం అంగరంగ వైభవంగా బుధవారం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా వందలాది చానెళ్లు, ఇతరత్రా మీడియాలు ఈ అపురూప ఘట్టాన్ని ప్రసారం చేశాయి.
అంతటి చారిత్రాత్మక సందర్భం ప్రపంచంలోనే అది పెద్ద ఆలయ కార్య నిర్వాహక సంస్థకి పట్టలేదా? హిందు మతస్థులకు అత్యంత ప్రధానమైన తిరుమల పుణ్యక్షేత్రం నిర్వహించే తిరుమల తిరుపది దేవస్థానం ఈ కార్యక్రమంపై చిన్న చూపు చూసిందా? లేకపోతే అన్ని ప్రైవేటు మీడియా సంస్థలూ రామమందిర నిర్మాణ ప్రారంభ ఘట్టాన్ని, దాని వివరాలను దాదాపు రోజులో సగం పాటు ప్రసారం చేస్తే… తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఆధ్యాత్మిక చానెల్ ఎస్వీబీసీ మాత్రం దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడం ఏమిటి?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన దగ్గర్నుంచి మతపరమైన వివాదాలు పెరుగుతున్న నేపధ్యంలో టీటీడీ మరోసారి వివాదాస్పదంగా ప్రవర్తించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణ ప్రారంభాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడంతో టీటీడీపై విమర్శలు వెల్లువెత్తాయి. దీన్ని పలు హైందవ సంస్థలతో పాటు భాజాపా నేతలూ తప్పు పట్టారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 చానెళ్లు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తే హిందువులకు సంబంధించిన అత్యంత ప్రధానమైన చానెల్ ఎస్వీబీసీ చేయకపోవడం ఏమిటంటూ భాజాపా నేత విష్ణువర్ధన్‌రెడ్డి నిలదీశారు. శారదాపీఠాన్ని ముఖ్యమంత్రి సందర్శిస్తే గంట పాటు నిర్విరామంగా ప్రత్యక్ష ప్రసారం చేసిన ఎస్వీబీసీకి అయోధ్యలో రామమందిర నిర్మానం కనపడలేదా? అని ప్రశ్నించారు.
ఈ పరిణామాలతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వాహకులు ఖంగుతిన్నారు. సమర్ధించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ ప్రారంభ ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయలేకపోవడానికి ఆ సమయంలో స్వామి వారి నిత్య కళ్యాణం కార్యక్రమం ఉండడమే కారణం తప్ప మరొకటి కాదని వీరు అంటున్నారు. ఏది ఏమైనా మరోసారి టీటీడీ మతపరమైన వివాదానికి చేజేతులా చోటు ఇచ్చిందనేది నిర్వివాదం. అయితే ఇదంతా ఎవరో కావాలని ఒక పద్ధతి ప్రకారం టీటీడీని అప్రతిష్ట పాలు చేయడానికి చేస్తున్న ప్రయత్నమని టీటీడీ అధికారులు అంతర్గతంగా భావిస్తున్నట్టు సమాచారం.













