ఏపీ సీట్లపై వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న బీజేపీ..!
ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు ఖరారయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి పోటీ చేయడం ఖాయమైంది. బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేలా ఒప్పందం ఖరారైంది. బీజేపీ 6 పార్లమెంటు స్థానాలు, 6 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేన 24 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడం ఖాయమైంది. ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపైన కూడా చర్చలు దాదాపు ఓ కొలిక్కి వచ్చాయి. ఈ విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
గత ఎన్నికలకు మించి లోక్ సభ స్థానాలు గెలవాలనేది బీజేపీ పట్టుదల. గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 290 స్థానాల్లో గెలిచింది. ఈసారి ఒంటరిగా 370 సీట్లు గెలవాలని టార్గెట్ గా పెట్టుకుంది. అందుకే ఎన్డీయేలోని పార్టీలతో ఆ మేరకు చర్చలు జరుపుతోంది. వీలైనన్ని పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడం ద్వారా ఎక్కువ సీట్లను చేజిక్కించుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. ఏపీలో కూడా తమకు ఎక్కువ పార్లమెంటు సీట్లు ఇవ్వాలని.. అసెంబ్లీ సీట్లు తక్కువైనా పర్లేదని స్పష్టం చేసింది. అందుకే అసెంబ్లీ సీట్ల విషయంలో పట్టు పట్టలేదు. కానీ పార్లమెంటు సీట్ల విషయంలో మాత్రం గట్టిగా పట్టుపట్టంది.
చివరకు 6 పార్లమెంటు, 6 అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఖరారైనట్టు సమాచారం. జనసేన ఒక పార్లమెంటు సీటును తగ్గించుకుంది కాబట్టి అవసరమైతే ఒకటి రెండు అసెంబ్లీ సీట్లను బీజేపీ తగ్గించుకోవచ్చని ప్రచారం సాగుతోంది. అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట, హిందూపూర్ లేదా అనకాపల్లి స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. కాకినాడ, మచిలీపట్నం సీట్లలో రెండు చోట్ల జనసేన పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ సీట్లు కావాలని బీజేపీ చివరివరకూ పట్టుబట్టింది. కానీ టీడీపీ ఆ సీట్ల విషయంలో ఈక్వేషన్లను బీజేపీ హైకమాండ్ కు వివరించింది. దీంతో ఆ సీట్లపై బీజేపీ వెనక్కు తగ్గింది.
నర్సాపురం నుంచి పోటీ చేసేందుకు రఘురామ కృష్ణంరాజు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇక్కడి నుంచి మాజీ మంత్రి కృష్ణంరాజు భార్యను కానీ లేదంటే నరేంద్ర వర్మను కానీ పోటీ చేయించాలని రాష్ట్ర బీజేపీ కోరింది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేశ్ తదితరులకు సీట్లు ఇచ్చేందుకు కమలం పార్టీ హైకమాండ్ అంత సుముఖంగా లేనట్టు సమాచారం. పార్టీకి మొదటి నుంచి సేవలందిస్తున్న నమ్మకస్తులకు మొదట టికెట్లు ఇవ్వాలనుకుంటోంది. హిందూపురం లేదా రాజంపేట నుంచి సత్యకుమార్ ను బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. అయితే రాజంపేట సీటు కావాలని సీఎం రమేశ్ కోరినట్టు సమాచారం.













