ఏపీ రాజధాని అమరావతిలోనే
ఆంధప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ఉండాలని, ఇందులో మరో ఆలోచన లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. తూళ్లురులో భారతీయ కిసాన్ సంఘ్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధానిలో జరిగే అభివృద్ధి అంతా ప్రధాని మోదీ చేయిస్తున్నదేనని, రాష్ట్ర ప్రభుత్వం రాజధానులు మార్చినా కేంద్ర సంస్థలు అమరావతిలోనే ఉంటాయని అన్నారు. అమరావతిలో అద్భుత రాజధానిని బీజేపీ నిర్మించి ఇస్తుందని అన్నారు. ప్రధాని మోదీ ప్రతినిధిగా హామీ ఇస్తున్నానని ఆయన చెప్పారు. అమరావతి రైతులకు ఇచ్చిన ప్లాట్లన్నింటినీ రూ.2 వేల కోట్లతో బీజేపీ అభివృద్ధి చేస్తుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే రాష్ట్రంలోనూ బీజేపీని గెలిపించాలని కోరారు. ఎన్టీఆర్ స్వగ్రామ నిమ్మకూరులో డిఫెన్స్ అకాడమీ నిర్మిస్తున్నామని తెలిపారు.













