పాపం.. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిన బీజేపీ పరిస్థితి
ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైనా పాగా వెయ్యాలని బీజేపీ చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. గతంలో టీడీపీతో పొత్తుపెట్టుకున్నప్పుడు కాస్త ఫర్వాలేదనిపించుకుంది. కానీ గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో పొత్తులు లేకపోవడంతో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. కానీ.. కేంద్రంలో అధికారంలో ఉండడంతో బలమైన నేతలను తమవైపు తిప్పుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. కానీ ఆ పార్టీకి అడుగడుగునా సవాళ్లే ఎదురవుతున్నాయి.
వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పుడు కాస్తోకూస్తో నిధులు రాష్ట్రానికి వచ్చాయి. అయితే లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి ఆ నిధులు ఏమాత్రం సరిపోవు. దీంతో బీజేపీపై అలిగిన చంద్రబాబు … ఆ పార్టీకి కటీఫ్ చెప్పేశారు. దీంతో బీజేపీ ఒంటరిదైపోయింది. అయితే కేంద్రంలో రెండోసారి కూడా అధికారంలోకి రావడంతో బీజేపీ దూకుడు మరింత పెంచింది. పైగా సోము వీర్రాజు లాంటి సిసలైన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించడంతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. పైగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇతర పార్టీల్లోని కీలక నేతలను చేర్చుకోగలిగారు. దీంతో ఇకపై ఏపీలో బీజేపీ కూడా ప్రధాన పార్టీగా ఎదుగుతుందని భావించారు.
కానీ ఇంతలోనే ఆ పార్టీకి తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి. మొన్నటివరకూ విశాఖను రైల్వే జోన్ గా ప్రకటించడంలో కేంద్రం తాత్సారం ప్రదర్శిస్తోందనే ఆరోపణలు ఎదుర్కొంది బీజేపీ. దీంతో చివరకు తలొగ్గిన బీజేపీ.. రైల్వే జోన్ ను ప్రకటించింది. అయితే అది ఏమాత్రం ముందుకు సాగట్లేదు. ఆ అసంతృప్తి ఇప్పటికీ ఉత్తరాంధ్ర వాసుల్లో ఉంది. ఇంతలోనే బీజేపీ మరోషాక్ ఇచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటికరిస్తామని ప్రకటించడంతో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది.
విశాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీజేపీ మినహా ఏపీలోని పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తున్నాయి. దీంతో బీజేపీ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా తయారైంది. ప్రైవేటీకరణపై ముందుకెళ్తే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. ఒకవేళ కాదని వెనక్కు తగ్గింతే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లవుతుంది. దీంతో ఏపీ బీజేపీ నేతలకు ఏం చేయాలో పాలుపోవట్లేదు.
నాలుగు సెక్టార్లు మినహా మిగిలిన ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరించాలనేది తమ ప్రభుత్వ విధాన నిర్ణయం అంటూ నిన్నమొన్నటివరకూ చెప్పుకొచ్చిన జీవీఎల్.. ఇప్పుడు కాస్త వెనక్కు తగ్గారు. ఇప్పటికిప్పుడు ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. అయితే ప్రైవేటీకరణ ఆగదని మాత్రం చెప్పలేదు. ప్రయారిటీలో కాస్త వెనక్కు వెళ్లొచ్చేమో కానీ.. ప్రైవేటీకరణ కావడం మాత్రం ఖాయం. పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్న ప్రతిసారీ బీజేపీకి ఏదో రూపంలో ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. మరి దీన్నుంచి బీజేపీ ఎలా గట్టెక్కుతుందనేది ఆసక్తి కలిగించే అంశం













