మీకు తెలియకపోతే.. ఆ అదృశ్య శక్తి ఎవరు?
తనకు తెలియకుండానే ప్రతిపక్షనేత అరెస్టు జరిగిందని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారంటే రాష్ట్రంలో పాలన ఎలాంటి దయనీయ పరిస్థితుల్లో ఉందో తెలుస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అరెస్టు విషయం తెలియనప్పుడు నెపం బీజేపీపైకి నెట్టే టక్కుటమార మాటలెందుకు? మీకు తెలియకపోతే సీఐడీకి ఆదేశాలిస్తున్న ఆ అదృశ్య శక్తి ఎవరు? అని ప్రశ్నించారు. కేసు వాదనల కోసం రూ.వందల కోట్ల ప్రజాధనం ధారపోస్తున్న ఆ ఉదార కుబేరుడు ఎవరు? వెకిలి మాటలకు, వికృత చేష్టలకు స్క్రిప్ట్ అందిస్తున్న ఆ ఆజ్ఞాత రచయిత ఎవరు? అని ప్రశ్నించారు. కరవు, కరెంటు కోతల మీద సమీక్షలు చేయడం తెలియదు. సాగునీటి, విద్యుత్ నిర్వహణ ఎలాగూ రాదు. సమయానికి ఉద్యోగులకు జీతాలివ్వడం అసలే గుర్తుండదు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, బాలింతలకు పోషకాహారం, పేదలకు ఇళ్లు, రహదారులు, ఎస్సీలకు సబ్‌ప్లాన్ నిధులు, యువతకు ఉద్యోగాలు లాంటివి ఏవీ ఇవ్వడం తెలియనప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఎందుకు జగన్ అంటూ ప్రశ్నించారు.













