రాజధాని నిర్మించుకోలేని అసమర్థ సీఎంగా… ఆయన
రాజధాని అమరావతికి గతంలో మద్దతిచ్చిన జగన్ ఇప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మించుకోలేని అసమర్థ సీఎంగా ఆయన నిలిచారన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ముసుగులో జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించి ఆరు నెలలు దాటితే ఇప్పుడు సుప్రీం కోర్టులో సవాలు చేయడమేంటని ప్రశ్నించారు. నమ్మకం లేనందునే ఇన్నాళ్లు ఆగారన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తుందన్న నమ్మకం తమకుందని చెప్పారు. జగన్ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ రోడ్లపై వైసీపీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. ప్రజల గొంతుకగా బీజేపీ ఆందోళనలు కొనసాగిస్తుందన్నారు.













