పవన్ చేతికి గోల్డెన్ ఛాన్స్ వచ్చేసిందా…?
2019 ఎన్నికల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అతి పెద్ద తప్పు భారతీయ జనతా పార్టీని కలుపుకొని వెళ్ళడం అని… ఆ పార్టీ నేతలు పదేపదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ నేతలు బహిరంగంగానే బీజేపీ మీద విమర్శలు చేయడం మనం చూసాం. మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో జనసేన పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీనే అని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ వ్యాఖ్యలు చేశారు.
ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన పార్టీ ప్రయాణం చేయడం అనేది పవన్ కళ్యాణ్ కు ఏ విధంగా చూసినా సరే అనుకూలంగా ఉండే అంశం కాదు అనే భావన కొంతమందిలో వ్యక్తమవుతుంది. రాజకీయంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ బీజేపీకి గుడ్ బై చెప్పాల్సిన సమయం దగ్గర పడింది అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ గుడ్ బై చెప్పి రాష్ట్రంలో సొంత గా ఎదిగే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని అంటున్నారు.
జనసేన పార్టీ బిజెపితో కలిసి వెళ్ళటం మొదలు పెట్టిన తర్వాత స్వతంత్రంగా ఏ ఒక్క నిరసన కార్యక్రమం కూడా చేయలేకపోయింది. జనసేన పార్టీ చేయాలని భావించిన కార్యక్రమాలను కూడా చేయలేక పోవడం గమనార్హం. అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఎన్నో కార్యక్రమాలను జనసేన అధినేత చేయాలని భావించారు. కానీ ఎక్కడా కూడా అనుకున్న విధంగా పరిస్థితులు కనపడలేదు. ఒకరకంగా వామపక్షాలతో కలిసి ముందుకు వెళ్లిన సందర్భంగా పవన్ కళ్యాణ్ చాలా సమర్థవంతంగా వ్యవహరించారు.
నిరసన కార్యక్రమాలు చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పై విమర్శలు చేయడం వంటివి ఆయన చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వతంత్రంగా విమర్శించేలేకపోతున్నారు. జనసేన పార్టీ నేతలు కూడా కనీసం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే విధంగా ఒక్క ప్రసంగం కూడా చేయలేని పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. ఎలాగో ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేసే ఆలోచన బిజెపికి లేదు… కాబట్టి… ఇక ఆ పార్టీ నేతలతో స్నేహాన్ని ముగించుకుని పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా పర్యటనలు చేసి గెలిచే అవకాశం ఉన్న జిల్లాల్లో పార్టీ నాయకత్వాన్ని సమర్థవంతంగా బలోపేతం చేసుకోగలిగితే మంచి ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ కార్యకర్తలు నేతలు కోరుతున్నారు.













