సుజనాచౌదరికి పితృవియోగం
రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావుగారు (88) శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. కృష్ణా జిల్లా దోసపాడులో 1932 జనవరి 9న జన్మించిన జనార్ధనరావు కోయంబత్తూరులోని పిఎస్జీ కాలేజి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు. అనంతరం 1955లో సాగునీటిశాఖలో జూనియర్ ఇంజనీర్ గా చేరారు. ఆంధప్రదేశ్ లో పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ముఖ్యంగా నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజి, శ్రీరామ్ సాగర్, కోయల్ సాగర్ గేట్ల నిర్మాణంలోను, వాటిని అమర్చడంలోను కీలకపాత్ర వహించారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయడంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం జనార్ధనరావుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. ఆయన మృతిపట్ల పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, బిజెపి నాయకులు, మిత్రులు, ఎన్నారైలు సంతాపం వ్యక్తం చేశారు.













