విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సరైన నిర్ణయం కాదు : సుబ్రహ్మణ్య స్వామి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయం ఏమాత్రం సరియైన నిర్ణయం కాదని, దాన్ని వ్యతిరేకిస్తున్నానని కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వ సంస్థలను ఏకబిగిన ప్రైవేటీకరణ చేయడం సరికాదని హితవు పలికారు. ప్రతిదాన్నీ ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదని, ఏవైనా బలమైన కారణాలుంటే మాత్రమే ఆ వైపుగా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సుబ్రహ్మణ్య స్వామి భేటీ అయ్యారు. ఈ విషయంపై ప్రధాని మోదీ సీఎం జగన్‌తో చర్చలు జరుపుతారన్న విశ్వాసంతోనే ఉన్నట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం లావాదేవీలను కాగ్ ద్వారా ఆడిట్ చేయించేందుకు సీఎం జగన్ అంగీకరించడం హర్షనీయమన్నారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్‌తో తనకు ప్రత్యేకమైన అనుబంధముండేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సీఎం జగన్‌తో భేటీ కావడం ఆనందంగా ఉందని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు.













