ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నాం.. కేంద్రం హోంశాఖకు
కడప కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవిని బీజేపీ నేత సీఎం రమేశ్ పరామర్శించారు. రవిని కలిసిన తర్వాత సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ బీటెక్ రవిని 14న కిడ్నాప్ చేసి చంపేయాలనుకున్నారు. కడప నగర శివార్లలో పోలీసు వాహనంలో మూడు గంటల పాటు తిప్పారు. ఆ తర్వాత పాతబడ్డ భవనంలోకి తీసుకెళ్లారు. నిజం చెప్పకపోతే చంపేస్తామని బీటెక్ రవిని బెదిరించారు. బతికి ఉంటే కదా నువ్వు పులివెందులలో పోటీ చేసేది అని హెచ్చరించారు. మీడియా వల్లే రవి బయపడ్డారు. ఈ వ్యవహారం అంతా మీడియాలో వస్తుందని తెలియగానే ఈ కేసు పెట్టారు అని అన్నారు.
వైసీపీకి తొత్తుగా సీఐ అశోక్ రెడ్డి పని చేస్తున్నారు. అశోక్ రెడ్డికి కచ్చితంగా బుద్ధి చెబుతాం. ఒకరి కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడి ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. ఈ ఘటనను సీరియస్గా తీసుకుంటాం. అశోక్ రెడ్డి అండ్ టీమ్ బీటెక్ రవిని కిడ్నాప్ చేసింది. అందుకు సంబంధించిన ఆధారాలున్నాయి. సీఎం జగన్కు రోజులు దగ్గర పడ్డాయి. బీటెక్ రవిని అరెస్టు చేసిన తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తాం అని తెలిపారు.













