కన్నా… ఇదేమి లేఖ? తేదేపా తోకా?
రాజధాని అంశం ఆంధ్రప్రదేశ్లో మరోసారి గరంగరంగా మారింది. రాజధాని వికేంద్రీకరణ, సిఆర్డీఎ బిల్లు రద్దు బిల్లులను ప్రభుత్వం గవర్నర్కు పంపడంతో విపక్షాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఈ బిల్లుల్ని ఆమోదించవద్దంటూ ఆంధ్రప్రదేశ్లోని విపక్ష పార్టీలు గవర్నర్కు లేఖలు, వినతులతో హోరెత్తిస్తున్నాయి. అదే క్రమంలో ఏపీ ప్రభుత్వ బిల్లుపై భాజాపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం గవర్నర్కు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో భాజాపా విపక్షమైనప్పటికీ… అదే పార్టీ నియమించిన గవర్నర్లకు తమ పార్టీ నేత లేఖ రాయడం సరైంది కాదని భాజాపా అగ్ర నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీనిపై కన్నా పై అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ లేఖ తమ పార్టీ వైఖరికి తగ్గట్టుగా లేదని పైగా మరో పార్టీ తెలుగుదేశం ఆలోచనలకు తగ్గట్టుగా ఉందని ఆక్షేపించినట్టు తెలిసింది. దీనిపై భాజాపా పెద్దలు గవర్నర్కు వివరణ ఇవ్వనున్నట్టు సమాచారం.













