ఎక్కడ.. ఏం అభివృద్ధి జరిగిందో సీఎం చెప్పాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై వరుస దాడుల వెనుక రాష్ట్ర ప్రభుత్వం అండదండలున్నాయని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరగడం గర్హనీయమన్నారు. రామతీర్థం ఘటన, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్టుకు నిరసగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్మాలో కన్నా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్రంలో 127 ఘటనలు జరిగితే ఇప్పటి వరకు ఒక్కరిని అరెస్టు చేయకపోగా, మంత్రులు ఎదురుదాడులు చేస్తూ తప్పులు కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మతమార్పిడులు యథేచ్ఛగా సాగుతున్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. హిందూ మతాన్ని, ధర్మాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా దేవాలయాలపై దాడుల అంశంతో ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడ.. ఏం అభివృద్ధి జరిగిందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.













