మా పార్టీ అధికారంలోకి వస్తే.. అమరావతిలోనే
తమ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతిలోనే రాజధానిని నిర్మిస్తామని బీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరూ రాజధానిని నిర్మించలేదన్నారు. మూడు రాజధానులని అంటున్న సీఎం జగన వాటికి కనీసం రూ.300 కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. వైసీపీలోని ఎమ్మెల్యేలు, పరిపాలకులుగా కాకుండా కేవలం ట్రేడర్స్గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ రాజకీయ పరిపాలన కొనసాగుతోందన్నారు. కుటుంబ పరిపాలనకు బీజేపీ దూరమని తెలిపారు. రాష్ట్రానికి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం గత నాలుగు సంవత్సరాలుగా 16 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని తెలిపారు. కేవలం ఎడ్యుకేషన్లోనే 10 రత్నాలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. 60 సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తోందని తెలిపారు. జగన్ కంటే మోదీ అందిస్తున్న సంక్షేమ పథకాలే రాష్ట్రంలో అధికమని తెలిపారు. 2024 అధికారం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. పత్తికొండ ప్రాంతంలో రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన 20 ఎకరాలను నాయకులు కబ్జా చేశారని తెలిపారు.













