జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడం బాధాకరం : భాను ప్రకాశ్‌రెడ్డి
రాజకీయంగా మాట్లాడాలనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధాన అర్చకుడి పదవికి రమణ దీక్షితులు రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రమణ దీక్షితులు ముఖ్యమంత్రి జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడం బాధాకరమని అన్నారు. రమణ దీక్షితుల వ్యాఖ్యలు టీటీడీ పవిత్రతకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. టీటీడీలో అన్యమతస్తులు లేరని అనడం దారుణమన్నారు. అన్యమతస్తులను వేరే విభాగానికి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో దేవస్థానంపై చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పిన తర్వాత రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడుగా రావాలన్నారు. తిరుమల దేవస్థానం ప్రతిష్టను భంగం కలిగించే విధంగా పింక్ డైమండ్ ఉందని, నేలమాళిగలు ఉన్నాయని ఆరోపణలు చేసిన రమణ దీక్షితులు ఇవాళ ప్రధాన అర్చకుడుగా ఏముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.













