ఏపీలో ఐపీసీ సెక్షన్ లు కాకుండా..వైసీపీ సెక్షన్ లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ లు కాకుండా వైసీపీ సెక్షన్ లు పనిచేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే ప్రత్యేక గౌరవంతో అన్నపూర్ణగా పిలిచేవారని అన్నారు. గత మూడేళ్లు ఏపీ అంటే అప్పుల ప్రదేశ్, అరాచక ప్రదేశ్, అవినీతి ప్రదేశ్‌గా మారిపోయిందన్నారు. మరో రెండేళ్లలో పాలన ఎక్కడికి వెళ్తుందో అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేరు మార్చి పబ్బం గడుపుకొంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపు కేసులు పెడుతూ వేధిస్తున్నారు. హత్యలు చేసి మృతదేహాలను డోర్ డెలివరీ చేసే పరిస్థితికి ఆ పార్టీ నేతలు చేరుకున్నారు.
రాష్ట్రంలో సామాన్యులకు న్యాయం జరగడం లేదు. సహనం నశిస్తే శ్రీలకం ప్రజల్లా తిరగబడతారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న శాంతిభద్రతల పరిస్థితులు చూసి పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఎప్పుడు ఎన్నికలకు వెళ్లినా ప్రజలు బుద్ది చెబుతారు. జగన్ మూడేళ్ల పాలనలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ఒక్క కేసు నమోదు చేయలేదు. హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ టీటీడీ నిధులను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక నేరగాళ్లను టీటీడీ బోర్డులో నియమిస్తున్నారు అని విమర్శించారు.













