ఏపీ కమల దళపతిగా కన్నా
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణ నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ బాధ్యతలను సోము వీర్రాజుకు అప్పగించారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వీరిద్దరినీ ఈ రెండు పదవుల్లో నియమించినట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ పత్రికా ప్రకనటలో వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలగిన తర్వాత రాష్ట్రంలోని బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకంపై బీజేపీ అధిష్ఠానం దృష్టి సారించింది. అందులో భాగంగా గత అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నుంచి ఏప్రిల్ 16వ తేదీన రాజీనామా తీసుకొంది.
కాపు సామాజికవర్గానికి ఆ పదవిని కట్టబెట్టాలని తొలినుంచీ భావించారు. అందులో భాగంగా అన్న లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, మాణిక్యాలరావు, ఆకుల సత్యనారాయణ పేర్లు తెరమీదికి వచ్చాయి. కంభంపాటి రాజీనామా చేసిన వారంలోపే కొత్త అధ్యక్షుడి నియామకం జరుగుతుందన్నంత హడావుడి జరిగింది. కానీ దాన్ని సాగదీయడంతో ఓపిక నశించిన కన్నా ఏప్రిల్ చివరి వారంలో వైకాపాలో చేరడానికి సిద్ధమయ్యారు. అనారోగ్యకారణంగా ఆసుపత్రిపాలుకావడంతో అది ఆగిపోయింది. ఇప్పుడు అనూహ్యంగా ఆయన్నే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంపై పార్టీలో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.













