పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ నష్టం కేసులో.. ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
పోలవరం ప్రాజెక్టు కోసం జరిగిన పర్యావరణ నష్టానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లాయర్లకు ఫీజు చెల్లించటంపై ఉన్న శ్రద్ధ కూడా ప్రభుత్వానికి పర్యావరణ రక్షణపై లేదని ఘాటుగా విమర్శించింది. పోలవరం నిర్మాణంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘన జరిగిందన్న జాతీయ హరిత ట్రైబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్.. ఏపీ ప్రభుత్వానికి రూ.120 కోట్లు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఎన్జీటీ తీర్పును సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 3 అంశాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మూడు వేర్వేరు అప్పీళ్లను దాఖలు చేసింది. ఏపీ అప్పీళ్లపై జస్టిస్ రస్తోగి, జస్టిస్ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో ఇప్పటికీ ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రతివాది పెంటపాటి పుల్లారావు తరపు న్యాయవాది ఆరోపించారు. ఈ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. అప్పీళ్ల విషయంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఈ కేసులో ఎందరు సీనియర్ లాయర్లను ఎంగేజ్ చేస్తున్నారు? సీనియర్ న్యాయవాదులను రంగంలోకి దించి కేసులు వాదించేందుకు తీసుకుంటున్న శ్రద్ధ పర్యావరణ పరిరక్షణలో లేదు. ఈ కేసులో లాయర్లకు ప్రభుత్వం ఎంత చెల్లించిందో తెలుసుకునేందుకు అవసరమైతే నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఎన్జీటీ తీర్పులపై దాఖలైన అన్ని అప్పీళ్లను ఒకేసారి విచారిస్తాం. పోలవరం, పురుషోత్తమపురం, పులిచింతలపై ఇచ్చిన తీర్పులపై విచారణ చేపడతాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ 3 అప్పీళ్ల విచారణను వాయిదా వేసింది.













