మాజీ మంత్రి నారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దు : హైకోర్టు
రాజధాని అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములు కొనుగోలు ఆరోపణల నేపథ్యంలో 2020లో సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి నారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. 41ఏ నిబంధనలు అనుసరించాలని సీఐడీ పోలీసులకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములను కొనుగోలు చేశారనే ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ 2020లో కేసు నమోదు చేసింది. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.













