Bhumana Karunakar Reddy: తిరుపతిలో రాజకీయ ఉద్రిక్తత..గోశాల వివాదంలో భూమన హౌస్ అరెస్ట్..
తిరుపతిలో (Tirupati) గురువారం ఒక్కసారిగా రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీటీడీ (TTD) గోశాలలో ఆవుల మరణాలపై జరుగుతున్న ఆరోపణలు, ప్రతిఆరోపణల నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ప్రకటించిన గోశాల సందర్శన విషయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ (Palla Srinivas) గోశాలలో జరిగిన పరిణామాలపై చర్చించేందుకు రావాలని సవాలు విసిరిన నేపథ్యంలో, భూమన గోశాలకే వస్తానని ప్రకటించడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.
భూమన కరుణాకర్ రెడ్డి తన సందర్శన ప్రకటన తర్వాత పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలతో రంగంలోకి దిగారు. అర్థరాత్రి నుంచే భూమన నివాసాన్ని తిరుచానూరు (Tiruchanur) పోలీసులు ముట్టడి చేసి హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు. ఉదయం 9.30కి గోశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన భూమనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ (YSRCP) నేతలు మరియు భూమన రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసుల తీరుపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, టీడీపీ నాయకులు గోశాలకు చేరుకుని భూమన కూడా అక్కడికి రావాలని డిమాండ్ చేశారు. అయితే శాంతియుత ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. టీటీడీ గోశాలలో ఇటీవల నెలల వ్యవధిలో అనేక ఆవులు మరణించాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నప్పటికీ, టీడీపీ నేతలు ఆ విషయాన్ని ఖండిస్తూ అవాస్తవ ఆరోపణలని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్రమైన రాజకీయ పోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు వైసీపీ నాయకులు గోశాలలో జరిగిన ఘటనలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఫలితంగా చూపిస్తుండగా, మరోవైపు టీడీపీ నేతలు వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ, వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుపతిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడి పుంచుకుంది.
ఇదిలా ఉండగా, ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా హౌస్ అరెస్ట్‌లో ఉన్నారు. వారిలో మల్లం రవిచంద్ర రెడ్డి (Mallam Ravichandra Reddy), కేతం జయచంద్ర రెడ్డి (Ketham Jayachandra Reddy), గీతా యాదవ్ (Geetha Yadav), అరుణ్ యాదవ్ (Arun Yadav), వంశీ (Vamshi)లు ఉన్నారు. శాంతి భద్రతల పరంగా పోలీసు దళాలు భారీగా మోహరించడంతో ప్రాంతం చుట్టూ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.













